హైదరాబాద్: ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ మరో కీలక ఆమోదం సాధించింది. అన్నవాహిక క్యాన్సర్ చికిత్సలో వినియోగించే తమ ఇమ్యునోథెరపీ ఔషధం 'జైటోర్వి' (జెనరిక్ పేరు: టొరిపాలిమాబ్)కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం లభించినట్లు సంస్థ బుధవారం ప్రకటించింది.
ఎవరికి ఉపయోగం?
శస్త్రచికిత్స ద్వారా తొలగించలేని, ముదిరిన, తిరగబెట్టిన లేదా ఇతర అవయవాలకు వ్యాపించిన అన్నవాహిక స్క్వామస్ సెల్ కార్సినోమా (ఈఎస్‌సీసీ) బాధితులైన వయోజనులకు ఫస్ట్-లైన్ చికిత్సగా సిస్ప్లాటిన్, పాక్లిటాక్సెల్‌తో కలిపి ఈ ఔషధాన్ని ఇవ్వవచ్చు. భారత్‌లో అన్నవాహిక క్యాన్సర్ కేసుల్లో సుమారు 80 శాతం ఈఎస్‌సీసీ రకానికి చెందినవేనని సంస్థ తెలిపింది. దేశంలో ఈ రోగులకు ఫస్ట్-లైన్ ఇమ్యునోథెరపీని మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని పేర్కొంది.
ఎలా పనిచేస్తుంది?
టొరిపాలిమాబ్ ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ. ఇది పీడీ-1కు అతుక్కుని, పీడీ-ఎల్1, పీడీ-ఎల్2లతో దాని అనుసంధానాన్ని అడ్డుకుంటుంది. తద్వారా క్యాన్సర్ కణాలపై టి-కణాలు పోరాడే సామర్థ్యం పెరుగుతుంది.







