తెలుగు వార్త 24
ఆంధ్రప్రదేశ్బ్రేకింగ్

సెప్టెంబరు మొదటి వారంలో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు: ముఖ్యమంత్రి చంద్రబాబు

అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పర్యటన

22 ఆగస్టు, 2026 06:40 PMకి1 నిమిషాల చదువువిశాఖపట్నం799 వ్యూస్
సెప్టెంబరు మొదటి వారంలో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఫైల్ ఫోటో

సెప్టెంబరు తొలివారంలోగా విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు తీసుకువస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు.. అభివృద్ధి అంటే పరిశుభ్రత కూడా భాగమేనని వ్యాఖ్య.

అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలు మాత్రమే కాదని, పరిశుభ్రమైన ప్రాంతాలు కూడా అభివృద్ధిలో భాగమేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరు గ్రామంలో పర్యటించిన సీఎం, అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదికలో మాట్లాడారు.

సెప్టెంబరు తొలివారంలోగా అనకాపల్లి, విశాఖపట్నం నగరాలకు గోదావరి నదీజలాలు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. ప్రతి ఒక్కరూ 'మన ఊరు-మన బాధ్యత' అనే సంకల్పాన్ని అలవర్చుకోవాలని, పరిశుభ్రత కోసం కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నానని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి పరిసరాల పరిశుభ్రత చాలా అవసరమని పేర్కొన్న సీఎం, ప్రధాని మోదీ నేతృత్వంలో 2047 నాటికి భారత్‌ అగ్రరాజ్యంగా ఎదుగుతుందని, అప్పటికి దేశ తలసరి ఆదాయం రూ.50 లక్షల వరకూ చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

అనకాపల్లి జిల్లాకు విశాఖపట్నాన్ని మించి పెట్టుబడులు వస్తున్నాయని, స్టీల్‌ సిటీ నిర్మాణంతో పాటు పలు డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయని సీఎం వివరించారు. భవిష్యత్తులో అనకాపల్లి నాలెడ్జ్‌ ఎకానమీకి కేంద్రంగా మారబోతోందని చెప్పారు. గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం విశాఖను ఎంపిక చేసుకున్న సంగతిని ప్రస్తావిస్తూ, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యపోతుంటే, కొందరు మాత్రం అభివృద్ధిని అడ్డుకునేందుకు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. డేటా సెంటర్‌ ప్రారంభం కాకముందే తాగునీటి కొరత వస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి డేటా సెంటర్‌ రావడం వల్ల లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు.

జిల్లాలోని ప్రతి చెరువు, రిజర్వాయర్‌ను నింపే బాధ్యత ప్రభుత్వానిదేనని, ప్రతి గ్రామం జీరో వేస్ట్‌ పంచాయతీగా మారాలని సీఎం పిలుపునిచ్చారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించే పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయని, ప్రతి గ్రామానికి స్వచ్ఛ రథాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇళ్లపై సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే విద్యుత్‌ ఖర్చు ఉండదని కూడా సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పట్టాభిరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండిWhatsAppFacebookXTelegram

తాజా వార్తల కోసం మా WhatsApp ఛానెల్‌ని ఫాలో అవ్వండి

సంబంధిత వార్తలు