విశాఖపట్నం: విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు రోజూ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో 11 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి. వీటి ద్వారా రూ.1,40,705 కోట్ల పెట్టుబడులు రానుండగా, 10,472 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఒప్పందాలు చేసుకున్న ప్రధాన సంస్థల్లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కూడా ఉంది.
హిందాల్కో విస్తరణకు జీవో
ఒప్పందాలతో పాటు ఏపీఐఐసీ పరిధిలో రసాయనాలు, పెట్రో రసాయనాల రంగంలో హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) జారీ చేసింది. రూ.880 కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ విస్తరణతో 447 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇదే రోజు కృభ్‌కో, గెయిల్ సంస్థలు రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత ఎరువుల ప్రాజెక్టు ఏర్పాటు అవకాశాలను పరిశీలించేందుకు ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ)తో ఒప్పందం చేసుకున్నాయి. మంత్రి నారా లోకేశ్ ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఎండీ శాశ్వత్ గోయెంకాతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు.
తొలి రోజు రూ.5.84 లక్షల కోట్లు
సదస్సు తొలి రోజైన గురువారం రాష్ట్ర ప్రభుత్వం 73 సంస్థలతో రూ.5,35,113 కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకుంది. ఇప్పటికే ఆమోదం పొందిన ప్రతిపాదనలకు సంబంధించి 15 జీవోలు జారీ చేయడంతో మరో రూ.49,242 కోట్లు జతకలిశాయి. దీంతో తొలి రోజే పెట్టుబడి హామీలు రూ.5,84,335 కోట్లకు చేరాయి. ఇందులో పునరుత్పాదక ఇంధన రంగం ఒక్కటే ఏడు ఎంవోయూలు, ఐదు జీవోల ద్వారా రూ.1.65 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. రిలయన్స్, గ్రీన్‌కో, కియా వంటి దిగ్గజ సంస్థలు భారీ పెట్టుబడులు ప్రకటించాయి. సదస్సుకు ముందు 141 ఎంవోయూలు, 30 జీవోల ద్వారా రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.46 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.







