తిరుపతి: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రగిరి మండలం చంద్రగిరి టోల్‌గేట్ సమీపంలో ఓ సుమో వాహనాన్ని ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
సర్వీస్ రోడ్డులోకి మళ్లుతుండగా
చంద్రగిరి టోల్‌గేట్ దాటిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఆరు లేన్ల జాతీయ రహదారి నుంచి పాత సింగిల్ లేన్ సర్వీస్ రోడ్డులోకి సుమో మళ్లుతుండగా, ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ దాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు సుమోలో ఉన్న ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు.
క్షతగాత్రుడి పరిస్థితి విషమం
తీవ్రంగా గాయపడిన నాలుగో వ్యక్తిని హైవే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వాసులుగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. మృతుల పేర్లు, ఇతర వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.







