న్యూఢిల్లీ: దేశంలో హింసను ప్రేరేపించేందుకు 'రెజీమ్ చేంజ్' కథనాన్ని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని, దీని వెనుక గుర్తుతెలియని, అనుమానాస్పద విదేశీ శక్తులు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాంశు త్రివేది బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉద్ధవ్ వ్యాఖ్యల నేపథ్యం
ప్రభుత్వ మార్పు అనివార్యమని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే సహా పలువురు విపక్ష నేతలు ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన త్రివేది, ఇలాంటి శక్తులు "దేశం లోపల, బయట కూడా ఉన్నాయి, వాటి మధ్య స్పష్టమైన సంబంధం కనిపిస్తోంది" అని ఆరోపించారు. హింస, కుట్రల ద్వారా ప్రభుత్వాన్ని కూలదోయడం, దేశ ప్రగతిని అడ్డుకోవడం, సమాజాన్ని విభజించడమే వారి అసలు లక్ష్యమని విమర్శించారు.
ప్రధాని దసరా ప్రసంగం ప్రస్తావన
అవినీతి, సామాజిక విభజన, భారతీయ సంస్కృతి-ధర్మాలపై వ్యతిరేకత ద్వారా దేశాన్ని అస్థిరపరిచే శక్తుల గురించి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విజయదశమి ప్రసంగంలో హెచ్చరించారని త్రివేది గుర్తుచేశారు. ఐరోపా దేశాల్లో జరుగుతున్న నిరసనలతో ఈ ప్రచారాన్ని ఆయన పోల్చారు. పండుగ సీజన్‌లో నిరసనల వల్ల వ్యాపారులు, వర్తకులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు.







