విశాఖపట్నం సమీపంలోని బొగ్గాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం ఇక్కడికి తొలి వాణిజ్య సర్వీసుగా చేరుకోగా, బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూడా సోమవారం సర్వీసులు ప్రారంభించింది.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తొలి విమానానికి పచ్చజెండా ఊపి, ప్రయాణికులకు స్వయంగా బోర్డింగ్ పాస్‌లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాణిజ్య సర్వీసుల ప్రారంభం ఉత్తరాంధ్రకు కొత్త అధ్యాయమని, ఈ ప్రాంతానికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఇప్పటికే ఈ నెల 1న ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించారు.
కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో పాత విశాఖపట్నం విమానాశ్రయంలో వాణిజ్య సర్వీసులు నిలిచిపోయాయి. ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో 6ఈ2018 రాత్రి 10.45 గంటలకు బయలుదేరడంతో అక్కడ వాణిజ్య కార్యకలాపాలు ముగిశాయి. ప్రస్తుతం ఆ విమానాశ్రయాన్ని జనరల్ ఏవియేషన్, ప్రైవేట్ విమానాల కోసం వినియోగించనున్నారు.







