విశాఖపట్నం: రాష్ట్రాన్ని ఇటీవల రెండు తుపానులు అతలాకుతలం చేసిన నేపథ్యంలో బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం (నవంబర్ 13) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ 14వ తేదీ నాటికి బలపడి తీవ్ర అల్పపీడనంగా, 15వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
ఏ జిల్లాల్లో వర్షాలు?
అల్పపీడన ప్రభావంతో నవంబర్ 13, 14 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు కురవచ్చు. రాయలసీమలోని అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి విస్తృతంగా భారీ వర్షాలు కురిసే సూచనలు లేవని, నవంబర్ 19 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక హెచ్చరికలేవీ జారీ కాలేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
దిశపై ఇంకా స్పష్టత లేదు
ఈ వ్యవస్థ వాయువ్య దిశగా కదులుతున్నప్పటికీ, అది ఏ మార్గంలో వెళ్తుంది, ఎంత బలపడుతుంది, తీరం దాటుతుందా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వాయుగుండం ఏర్పడినంత మాత్రాన తుపానుగా మారుతుందని చెప్పలేమని, తదుపరి 48 నుంచి 72 గంటల్లో దీని గమనంపై స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు. తుపానుగా మారకపోయినా ఈ వ్యవస్థ ప్రభావంతో అండమాన్–నికోబార్ దీవులు, తమిళనాడు, కేరళ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో నవంబర్ 14 నుంచి 16 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.







