ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధిలో అంతర్జాతీయ నైపుణ్యాన్ని జోడించే దిశగా కీలక ముందడుగు పడింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు, బ్రిటన్ వాణిజ్య శాఖకు మధ్య మంగళవారం ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, యూకే డిప్యూటీ డైరెక్టర్ చాజ్ వాలియా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సుమారు రూ.40,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టనున్నారు. పట్టణ ప్రణాళిక, సుస్థిర మౌలిక సదుపాయాలు, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు, మెట్రో రైలు-బస్సు అనుసంధానం, విమానాశ్రయ కనెక్టివిటీ, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, డిజిటల్ ట్విన్ టెక్నాలజీ, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, రోడ్లు-డ్రైనేజీ-తాగునీరు-వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలు ఇందులో భాగంగా ఉన్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే అమరావతి అభివృద్ధిలో ప్రపంచస్థాయి సాంకేతికతను తీసుకొచ్చేందుకు ఈ ప్రయత్నం చేపట్టినట్టు మంత్రి పి.నారాయణ తెలిపారు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ యూకే సాంకేతికత ద్వారా మెరుగైన ప్రమాణాలతో పనులు పూర్తి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. యూకే ఎగుమతి ఫైనాన్స్ ద్వారా అంతర్జాతీయ నిధులను సమీకరించడంతోపాటు, లండన్‌కు చెందిన ప్రముఖ డిజైన్ సంస్థ ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ నైపుణ్యాన్ని కూడా వినియోగించుకోనున్నారు.






