రేషన్‌కార్డు లేని మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఊరటనిస్తూ ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ కొత్త బియ్యం పథకాన్ని అమల్లోకి తెచ్చింది. మార్కెట్‌లో నాణ్యమైన బియ్యం ధరలు రూ.50 నుంచి రూ.65 వరకు ఉంటున్న నేపథ్యంలో, ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతుబజార్లు, రైస్‌మిల్లు కేంద్రాల ద్వారా తక్కువ ధరకే బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఈ పథకం కింద బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని కిలో రూ.52కే, బీపీటీ రా రైస్‌ను కిలో రూ.50కే విక్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతుబజార్లు, అదనంగా 500 రైస్‌మిల్లు కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. రేషన్‌కార్డు అవసరం లేకుండా, కేవలం ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యాన్ని విక్రయిస్తున్నారు.
పౌర సరఫరాల శాఖ తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న బియ్యం ధరల భారం నుండి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించడమే ఈ పథకం లక్ష్యమని ఆయన తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘంతో ప్రభుత్వం సమన్వయం చేసుకుంది.








