అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 92 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి 138 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత సాధారణ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. రాత్రి 8 గంటలకల్లా దాదాపు అన్ని ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
లెక్కింపు ముఖ్యాంశాలు
- ఎన్నికల్లో సుమారు 60 లక్షల మంది ఓటర్లు.. పోలింగ్ శాతం 62.16%
- లెక్కింపు విధుల్లో 47,817 మంది అధికారులు, సిబ్బంది
- బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తున్నందున ఒక్కో వార్డుకు గంట నుంచి గంటన్నర సమయం
- తుపాను ప్రభావంతో ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కౌంటింగ్‌ను ఉదయం 11.30 గంటలకు వాయిదా వేశారు.. రేపల్లెలో 10 గంటలకు ప్రారంభం
మేయర్ పీఠాలపై పోరు
13 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అన్ని చోట్లా పోటీ చేసింది. వీటిలో టీడీపీ 10, జనసేన 2, బీజేపీ 1 స్థానంలో బరిలో నిలిచాయి. వైఎస్సార్సీపీ కూడా మొత్తం 13 కార్పొరేషన్లలో పోటీ చేసింది. విశాఖపట్నం (జీవీఎంసీ), విజయవాడ కార్పొరేషన్ల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. జీవీఎంసీ ఓట్ల లెక్కింపు ఆంధ్రా యూనివర్సిటీలో జరుగుతోంది.
పులివెందులపై ఉత్కంఠ
రీపోలింగ్ జరిగే వరకు పులివెందుల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు నిలిపివేయాలని వైఎస్సార్సీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో అక్కడ కౌంటింగ్ ప్రారంభమైంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా, పలు చోట్ల గట్టి పోటీ ఇస్తామని వైఎస్సార్సీపీ చెబుతోంది. ఫలితాల తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తాం.







