విజయవాడ: రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గురువారం (నవంబర్ 5) జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఏపీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. 28 జిల్లాల్లోని 582 జెడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
డీజీపీ హరీష్ గుప్తా బందోబస్తు ప్రణాళిక
17,555 పోలింగ్ ప్రాంతాలు, 31,472 పోలింగ్ కేంద్రాలను కవర్ చేసేలా సమగ్ర బందోబస్తు ప్రణాళిక రూపొందించినట్లు డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టామన్నారు.
- వివిధ హోదాల్లో 38,348 మంది పోలీసులు, 111 ఏపీఎస్పీ ప్లాటూన్లు
- 1,841 అత్యంత సమస్యాత్మక, 2,645 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
- 3,488 రూట్ మొబైల్స్, 931 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 412 చెక్‌పోస్టులు
- 547 పంపిణీ కేంద్రాల వద్ద 1,381 మంది సిబ్బంది
- బ్యాలెట్ బాక్సుల భద్రత కోసం 178 స్ట్రాంగ్ రూమ్‌లు
సీసీటీవీ, వీడియోగ్రఫీ, డ్రోన్లు, బాడీ వోర్న్ కెమెరాలు, సమర్థ్ యాప్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీనియర్ అధికారులు పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తారు.







