ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తవడంతో మండల ప్రజా పరిషత్‌లు (ఎంపీపీ), జిల్లా ప్రజా పరిషత్‌ల (జడ్పీపీ) పరోక్ష ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎన్నికల షెడ్యూల్
- నవంబర్ 14 లోపు: ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక సమావేశాల నోటీసుల జారీ
- నవంబర్ 19: రాష్ట్రవ్యాప్తంగా 659 మండల ప్రజా పరిషత్‌ల ఎన్నికలు
- నవంబర్ 20: 28 జిల్లా ప్రజా పరిషత్‌ల ఎన్నికలు
ముందుగా కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక
అధ్యక్ష, ఉపాధ్యక్షులు, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవుల ఎన్నికకు ముందే కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీ వర్గాలకు చెందిన వారిని కో-ఆప్టెడ్ సభ్యులుగా ఎంపిక చేస్తారు. ప్రతి మండల పరిషత్‌కు ఒకరు, ప్రతి జిల్లా పరిషత్‌కు ఇద్దరు చొప్పున కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాలి.
చేతులెత్తే విధానం.. పార్టీ విప్ తప్పనిసరి
ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, జడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు చేతులెత్తే విధానంలో జరుగుతాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల విప్ వర్తిస్తుంది. అంటే సభ్యులు తమ పార్టీ జారీ చేసిన విప్ ప్రకారమే ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు పార్టీ విప్ జారీ చేసే నిబంధన లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.







